శిశిరానికి తలవాల్చి – ఆకురాల్చిన అవనికి
చిగురాశలు కల్పించును – వసంతసమీరం
నిరాశ నిస్పృహతోడ – నీరసిల్లిన మనిషికి
ప్రభుయేసునందు ఉన్నది – శతవసంతాల సారం
1. అవిధేయతయే పెరిగి – ఆజ్ఞలనతిక్రమించిన
మనుజాళిని ఆవరించె – పాపపు తిమిరం
భువిదివి సంధానమై – ఇల నర సంతానమై
అరుదెంచిన ప్రభు చీల్చెను – నిభిడాంధకారం
2. పిలచుచున్న తండ్రి నుండి – తొలగి తొలగి
దూరమరిగి చెదరిన మనుజాళికి – మిగిలె శాపభారం
నిజరక్షణ హేతువై – పరదైసుకు సేతువై
వెలసిన ప్రభువే చేర్చును – ప్రశాంతతాతీరం