హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు
నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను (2)        ||హృదయ||

పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ
నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ||

కరుణా శీలుండతడు గాన గాచి యున్నాడు
యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు (2)        ||హృదయ||

ఎంత సేపు నిలువ బెట్టి యేడ్పింతు రతని
నాత డెంతో దయచే బిలుచుచున్నా డిప్పుడు మిమ్ములను (2)        ||హృదయ||

అతడు మిత్రుడతడు మిత్రుం డఖిల పాపులకు
మీర లతని పిలుపు వింటి రేని యతడు ప్రియుడగును (2)        ||హృదయ||

జాలి చేత దన హస్తముల జాపి యున్నాడు
మిమ్ము నాలింగనము సేయ గోరి యనిశము కనిపెట్టు (2)        ||హృదయ||

సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు
తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు (2)        ||హృదయ||

చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు
నతడు చేర్చుకొనుచు మీ కిచ్చును చీర జీవము కృపను (2)        ||హృదయ||

అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
మీర లతని హత్తుకొందు రప్పు డానందము తోడ (2)        ||హృదయ||

 

బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు చూడు
గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి (2)        ||హృదయ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *