భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును

 

భజన చేయుచు భక్తపాలక 

ప్రస్తుతింతు నీ నామమును (2) 

వృజినములపై జయము నిచ్చిన (2) 

విజయుడా నిను వేడుకొందు         ||భజన|| 

 

దివ్య పదవిని విడిచి నీవు 

దీనుడవై పుట్టినావు (2) 

భవ్యమైన బోధలెన్నో (2) 

బాగుగా ధర నేర్పినావు           ||భజన|| 

 

నరుల గావను పరమునుండి 

ధరకు నీవు వచ్చినావు (2) 

పరుడ నైన నా కొరకు నీ (2) 

ప్రాణము నర్పించినావు           ||భజన|| 

 

చెడినవాడ నైన నన్ను 

జేరదీసి ప్రోచినావు (2) 

పడిన నాడు గోతి నుండి (2) 

పైకి లేవనెత్తి నావు          ||భజన|| 

 

ఎంత ప్రేమ ఎంత దయ 

ఎంత కృప యేసయ్య నీకు (2) 

ఇంతయని వర్ణింప నిలలో (2) 

నెవనికిని సాధ్యంబు కాదు          ||భజన||