నడిపించు నా నావా నడి సంద్రమున దేవా

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా

నవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు||

 

నా జీవిత తీరమున నా అపజయ భారమున

నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు

నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు||

 

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము

రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము

రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో

రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు||

 

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి

అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి

ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే

ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు              ||నడిపించు||

 

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని

ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని

ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది

ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       ||నడిపించు||

 

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా

లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి

లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు

లోపించని అర్పనగా లోకేష చేయుమయా         ||నడిపించు||

 

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని

ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ

పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో

 

ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు     ||నడిపించు||