అడిగినది కొంతే అయినా

అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయ్యా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా            ||అడిగినది||

ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే (2)
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును            ||అడిగినది||

క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పుడను నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ (2)
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా                 ||అడిగినది||

మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రచురించెదను నీ పావన చరితం (2)
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీనుని సేవను చేకొనుమయ్యా          ||అడిగినది||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *